Saturday, July 6, 2013

ఓ హెన్రీ కథ ప్రేరణతో -లుటేరా ( LOOTERA)



 ఈ లైన్ చూడు,  సినిమా ఓ హెన్రీ కథ ప్రేరణగా తీసిన సినిమా అట..
అయ్యుండొచ్చు. హెన్రీ కథలు నేను చదివాను . చాలా వరకూ ఇలానే ఉంటాయి. ప్రేమికుల మద్య చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న త్యాగాలు వీటితోనే అతని చాలా కథలు అల్లుకుని ఉంటాయి.
ఔనా ?
ఔను .. మచ్చుకోకథ మనం ఈ సినిమా థియేటర్ బయటకెళ్ళే లోపు చెప్తా విను.
ఓ అందమైన భార్యా భర్త ఉంటారు.  ఇక్కడ అందం అంటే రూపు రేఖల్ని గురించి కాదు. మనస్సు గురించి. మనస్సుల్లో కల్మషం లేనంతవరకూ ఏ బంధమైనా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ జంటలో భర్తకి ఓ వాచ్ ఉంటుంది. వాచ్ బావుటుంది కానీ దాని స్ట్రిప్ అంతగా బాగోదు. అతనికెలాగైనా స్ట్రిప్ ని గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని ఆమె అనుకుంటూ ఉంటుంది. ఐతే ఆమె దగ్గర డబ్బులుండవు. అందమైన కురులు మాత్రమే ఉంటాయి. ఆమె భర్తకి ఆమె కురులంటే భలే ఇష్టం. ఆ కురులకి ఇంకా అందం తెచ్చేట్టు ఉందనిపించేలా ఓ క్లిప్ కనిపిస్తుంది. అతనిదగ్గరా డబ్బులుండవు. దాంతో చేతికున్న వాచీ అమ్మేసి ఆ క్లిప్పు, ఇంకొన్ని సామాన్లు ఆమెకోసం కొనుక్కుని ఆమెదగ్గరికి వెళ్తాడు. ఓయ్ .. నీకో గిఫ్ట్ తెచ్చానంటాడతను . నేనూ మీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను అంటుందామె. ఇద్దరూ ఒకేసారి గిఫ్ట్ లు చేతులు మార్చుకుంటారు. ఆమె కురులకోసం అతను వాచీ అమ్మేస్తే, ఆమె అతని వాచీకోసం ఆమె కురుల్ని అమ్మేసి స్ట్రిప్ కొంటుంది. చివరకి ఇద్దరికీ ఇష్టమైనవి
బాగుంది కథ. ఓ హెన్రీ కథలు అనే పుస్తకాన్ని నిన్న మొన్నల్లో ఎక్కడో చూసాను. DLI లోనో, లేక  కోఠి బజార్లోనో.. అది సరే కానీ ఈ సినిమా నీకెలా అనిపించింది.
సినిమాలోనే ఓ సెంటెన్స్ ఉంది. చూడు మాస్టర్ పీస్”. అలా అనుకోవచ్చు.
         
ఏంటిదంతా అనుకోవద్దు. లుటేరాసినిమా చూసి బయటకొచ్చేప్పుడు , నాకు వేణుకు మద్య జరిగన సంభాషణా సారమిది. సినిమా గురించి చెప్పాలంటే ఓ కథకి ప్రాణం వచ్చి దృశ్యంలా మారితే అది లుటేరా.  బాలీవుడ్ ఇప్పుడు స్టేటస్ సింబల్ గా చెప్పుకుంటున్న 100 కోట్ల కలెక్షన్ సినిమా అనే మార్క్ ఈ సినిమాకి  ఈ సినిమా అందుకోవచ్చు, అందుకోక పోనూవచ్చు.  కానీ మంచిసినిమాగా, ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాగా లుటేరాకి మంచి మార్కులే పడతాయి. 





సినిమా కథ విషయానికొస్తే 1953 వ సంవత్సరం లో ఓ జమీందారీ సంస్థానం నేపద్యంలో జరుగుతుంది.
ఆ సంస్థానాధీశుని ఏకైక కుమార్తె  శ్వాస సంబంధమైన ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పుడు శాంతినికేతన్ లో చదువుకుని, ప్రస్తుత కాలంలో పొగరుగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ కారు డ్రైవర్ ని బెదిరించి చిన్న చిన్న రోడ్లపైకూడా మరీ వేగంగా కారుని నడుపుతుంది. అలా నడుపుతూ ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ వ్యక్తిని కింద పడేస్తుంది. అతన్ని హాస్పిటల్ లో చేర్పించి అతన్నే చూస్తూ ఉండిపోతుంది. తర్వాతి రోజు తొలి వలపుల తొలి ఆకర్షణని తను అనుభవించే క్షణానే అతగాడు తన ఇంట్లో ప్రత్యక్షం అవుతాడు. తను పురావస్తు శాఖకి సంబందించిన వ్యక్తిననీ, ఆ జమీందారీ లో తవ్వకాలను జరిపేందుకుగానూ అనుమతి ఇవ్వాల్సిందిగా జమీందారును కోరతాడు. మాటల మద్యలో సోనాక్షిని  అతనికి పరిచయం చేస్తాడు. ఆమెకు రాయటం అంటే ఇష్టమని చెప్తాడు. ఆమె ఏదో ఒక పాత పుస్తంలో తనకు నచ్చిన వాఖ్యాల్ని చదివి వినిపిస్తుంది, మద్యలో  అతనూ గొంతు కలుపుతాడు. అతనికున్న సాహిత్యాభిలాషని ఇష్టపడ్డ జమీందారు అతన్ని తన ఇంట్లోనే ఉండాల్సిందిగా కోరతాడు. అతడు తన స్నేహితునితో పాటూ  జమీందారు ఇట్లో ఉండటం మొదలెడతాడు. సమానుతో పాటు పెయింటింగ్ కాన్వాస్ ని కూడా ఆ ఇంట్లో పెడతాడతను. ఎప్పుడూ ఖాళీగా తప్ప ఏరోజూ  దానిమీద ఒక్క గీత కూడా తను చూడలేదని అతని స్నేహితుడు ఎద్దేవా చేస్తాడు. నేను ఆలోచిస్తున్నాను, అన్వేషిస్తున్నాను. ఈరోజు నేను గీయక పోవచ్చు. కానీ ఏదో ఓ రోజు నేను గీసిన చిత్రంగురించి ప్రపంచం తప్పక మాట్లాడుతుంది. అలాంటి ఓ మాస్టర్ పీస్ నేను గీస్తానని జవాబు చెప్తాడు అతడు.  తన గదిలోంచి కింద ఉన్న కాన్వాస్ ని  గమనించిన ఆమె, తనూ పెయింటింగ్ నేర్చుకుంటానని తండ్రిని కోరుతుంది. ఆ విధంగా ఆమెకు పెయింటిగ్ నేర్పటానికి వచ్చిన అతనికి ఆమె పెయింటిగ్ నేర్పుతుంది.  ఇద్దరిమద్యా పరిచయం ప్రేమగా మారుతుంది. తను ఆమెను ప్రేమిస్తున్నాని తన స్నేహితుడితో అంటాడతను. మన పనికాగానే తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంతలో ఆ అమ్మాయిలో అలాంటి ఆశలు రేపటం మంచిది కాదన్న అతని స్నేహితుడు సలహాతో తర్వాతి రోజు నుంచి ఆమెకు దూరంగా ఉండ బోతాడతాడు. ఆ రోజుంచి ఆమె దగ్గర పెయింట్ నేర్చుకోవటానికి వెళ్ళటమే మానేస్తాడు. ఆమే అతను పనిచేసే స్థలానికొస్తుంది. ఎందుకు దూరంగా ఉంటున్నావని అతన్ని నిలదీస్తుంది. చాలా ఆవేశ పడుతుంది.అప్పుడే ఆమెకున్న అనారోగ్యంగురించి అతనికి తెలిసొస్తుంది. ఆమెకు మానసికంగా మరింతదగ్గరౌతాడతను.


ఇంతలో జమీదారీ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. జమీందారుకు 15 ఎకరాల భూమి మినహా మరేమీ ఉండకూడదని, జమీందారీ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయని ప్రకటిస్తుంది.  ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి జమీందారీ దివాణంలో సోదా చేస్తాడు. ప్రభుత్వానికి చెందిన సామాన్లన్నీ ప్రభుత్వ ఖజానాకు తరలించటానికే వచ్చినట్లు   జమీందారుకు చెప్తాడు. జమీందారు దానికి ససేమిరా కాదని అంటాడు. అదెలా కుదురుతుందని ? ఆ వస్తువులు ఈస్టిండియా వర్తక కంపెనీ తన పూర్వీకులకు బహుమతిగా వందేళ్ళ క్రితం బహుమతిగా ఇచ్చినవని వాదిస్తాడు.
ఈస్టిండియా కంపెనీ ఇచ్చినవేమీ కంపెనీ స్వంత సొత్తుకాదని, ప్రజాధనాన్ని దోచుకుని ఇచ్చినవని అవి తిరిగి భారత ప్రభుత్వానికే చెందుతాయని  ఆ అధికారి చెప్పి ఆ సామాన్లని జప్తు చేసేసుకుంటాడు.   

బ్రిటీష్ ప్రభుత్వం నుంచి మీకు స్వాతంత్రం వచ్చింది. మాకు పోయింది. మేం చేసిన తప్పేంటి ? మన దేశ స్వాతంత్రం కోసం మేమూ పాటు పడ్డాం? అజాద్ హింద్ ఫౌజ్ కోసం మేమూ ఖర్చు చేసాం. అలాంటిది మన దేశం లో మేం పరాయి వాళ్ళం అయిపోయాం. ప్రభుత్వం దోపిడీకి దిగింది. జమీందారులపై కక్షకట్టింది. అని జమీందారు ఆ ఇంట్లో ఉంటున్న యువకుడితో వాపోతాడు.
ఈ ఊరికి వచ్చిన పని అయిపోవటం వళ్ళ, తను వెళ్లి పోవాల్సి ఉందని, ఐతే ఇప్పటికి మించిపోయిందేమీ లేదని ఈ జమీందారీలో అతి విలువైన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయని, మీరు ఒప్పుకుంటే వాటిని అమ్మటంలో తను సహాయం చేస్తానని ఆ యువకుడు అంటాడు. దానికి జమీందారు ఒప్పుకుంటాడు.

జమీందారు కుమార్తె అతను వెళ్లి పోతానంటే వెల్లొద్దని బతిమాలుతుంది. కన్నీటితో అతని చెంత చేరిపోతుంది. మరుసటిరోజు జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటానని జమీందారుని కోరతాడతను. దానికి జమీందారు ఒప్పుకుంటాడు. పెళ్లి పనులు మొదలౌతాయి. జమీందారు ఆయువకుడు చెప్పిన వ్యక్తికి పురాతణ వస్తువుల్ని అమ్మేస్తాడు. ఆ వ్యక్తి  ఆ యువకున్ని పెంచిన వ్యక్తి. ఈ పెళ్ళికి అతను ఒప్పుకోడు. ఒక వేళ అతనుగానీ జమీందారు కూతుర్ని చేసుకుంటే .. జమీందారు దివానంలో ఉన్న  అతిపురాతన వస్తువుల్ని, పురావస్తు శాఖ అనే నెపంతో  సొరంగ మార్గం ద్వారా దోపిడీ చేసిన పథకం మొత్తం బయట పడుతుందని భయపెడతాడు...

ఇక్కడితో లుటేరా ( దోపిడీ దారుడు ) ఎవరనేది మనకి తెలుస్తుంది.
              వస్తువులకి బదులుగా ఇచ్చిన డబ్బులు కూడా నకిలీవని తేలుతుంది. కూతురు పెళ్లి ఆగిపోయిన దుఃఖానికి, నమ్మక ద్రోహానికి జమీందారు గుండె ఆగిపోతుంది. జమీందారు కూతురు ఆరోగ్యం క్షీణించి, కృశించి పోయి రోజులు లెక్క పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత  ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కలుసుకున్నారు. ఆమె ప్రతీకారం తీర్చుకుందా ?. అతను మారాడా ? అతని ప్రేమలో నిజమెంత ? అనే అంశాలతో ద్వితీయార్ధం సాగుతుంది.
జీవితాన్నంతటినీ  ఒక్క పుస్తకంలో అయినా రాద్దామనే ఆఖరి ఆశతో ఆమె రచన ప్రారంభం అవుతుంది.
ఒకానొక సందర్భంలో ఎందుకిలా చేసావ్ . నాకెదురుగా ఒక చెట్టుంది. రోజూ దాన్నే చూస్తాను . ప్రతీరోజూ దానికున్న ఆకులు రాలిపోతూ ఉంటాయి. నాలో ఆశల్లా.  దాని చివర ఆకు రాలిన క్షణాన నాలో ఆశే కాదు, నా శ్వాస కూడా ఉండదు. నన్నలా నువ్వే మార్చావ్. నాకంటూ నాకేమీ లేనట్టు. నాకే నేనేమీ కానట్టు ..  అని రాస్తుంది.

అనుకోకుండా ఆ వాక్యం అతని కంట పడుతుంది . ఎదురుగా ఒక్కో ఆకుని కోల్పోతూ నగ్నంగా మారిపోతున్న చెట్టుని చూస్తాడు. ఆఖరి ఆకుతో తన ఆశల్ని .. ఆమాట కొస్తే జీవితాన్నే ముడిపెట్టుకున్న ప్రియురాలికోసం ఒకే ఒక చిత్రం గీస్తాడు. అతనుగీయాలనుకున్న మాస్టర్ పీస్ వాడిపోని. రాలి పోని ఆకు .. చిట్ట చివరి ఆకు .. ఆకుని చిటారు కొమ్మన వేలాడేసి .. పోతాడు. ఎప్పటికీ ఆమె శ్వాస ఆగిపోకూదనే ఆశ తో .. అతనెళ్ళిపోతాడు.. అతని జీవిత గమ్యం వైపు ..


లుటేరా కి స్పూర్తినిచ్చిన ఓ హెన్రీ కథ .. The Last Leaf “.
కథ , దర్శకత్వం : (విక్రమాదిత్య మోత్వానే  ). 
స్క్రీన్ ప్లే : (భవానీ అయ్యర్ , విక్రమాదిత్య మోత్వానే )
సంగీతం  : ( అమిత్ త్రివేది )

మంచి సినిమా , మిస్ కాకుడా చూడొచ్చు. 

Wednesday, July 18, 2012

నిరీక్షణ .. ( ఒరియా అనువాదకథ )


మహానదీ నదీపరీవాహక ప్రాంతంలో.. సెరంగడ అనే దట్టమైన అటవీ ప్రాంతంలో నాగరికతకు దూరంగా, గిరిజన, ఆదివాసీయుల తండాలకి సమీపంలో దుబ్బుగడ్డితో చేసిన ఓ పూరిళ్ళు ఉండేది. ఆఇంట్లో తల్లీ కూతుళ్ళు నివాసముండేవారు. కూతురు పుట్టిన కొన్నాల్లకే భర్త చనిపోవటంతో ఎన్నోకష్టాలకోర్చి కూతుర్ని పెంచుతోంది చింతన. బాటసారుల గుర్రాలకి ఆహారంగా ఉలవలతో దాణా తయారుచెయ్యటం, పచ్చిక మైదానాల్లోఉన్న గరికగడ్డిని కోసుకొచ్చి అమ్మటం, వెదురుతో బుట్టల్ని-బొమ్మల్ని చెయ్యటంలాంటి పనులు చేస్తూ, వాటిని అమ్మికుటుంబాన్ని గడుపుకురాసాగింది.

ఆమె కూతురు దివ్య.. పేరుకు తగ్గట్టే సకలసద్గుణ సంపన్నురాలు. అపురూప సౌందర్యవతి. పదహారేళ్ళ వయస్సులో తన అందచందాలతో మహానది ఒడ్డున, తన ఒయ్యారాలొలికిస్తూ, సెరంగడ అడవిలోనున్న ప్రతీ ప్రాణితో చెలిమి చేస్తూ ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ తుళ్ళుతూ, తన తల్లికి పనిలో చేదోడువాదోడుగా ఉండేది. యవ్వనవతియైన కూతురిని చూసి మురిసిపోతూ, ఆమె వివాహంగురించి బెంగపడుతూ ఉండేది చింతన.

నీకూతురుకేంటమ్మా? పుత్తడిబొమ్మలా ఉంటుంది. రాకుమారిలాంటి అందం తనది. ఆమె పెళ్ళిగురించి అంతగా బాదపడాలా చెప్పు ? . ఏ యువరాజో వెతుక్కుంటూ వచ్చి మరీ పెళ్ళిచేస్కుంటాడు చూస్తుండు అంటూ చుట్టుపక్కనున్న తండావాసులు అనేవారు  . అది నిజమవుతుందనే అనిపించినా, అందని అందలాలకోసం ఆశపడే వ్యక్తిత్వం తనది కాకపోవటంతో  కూతురు పెళ్ళి ఎలా చెయ్యాలా అని ఆలోచించి బాధపడసాగింది ఆమె.  ఇరవైనాల్గుగంటలూ కూతురు పెళ్ళిగురించిన ధ్యాసే ఆమె మనస్సును వెంటాడి వేధించటంతో క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించి మంచాన పట్టింది.

పనిచెయ్యలేని పరిస్థితిలో ఉన్న కన్నతల్లిని చూసి దిగులుపడింది దివ్య. తల్లిగురించి తనమనసులో ఉన్న బాధని, భయాన్ని లోలోపలే దాచుకుని మామూలుగా తిరగసాగింది. తననుకన్నతల్లికి తానేఅమ్మగా మారి సేవలు చెయ్యటం మొదలెట్టింది.
ఉదయాన్నే నిద్రలేచి అమ్మను చూడటం, వాకిలి ఊడ్చి కల్లాపు చల్లటం, అమ్మకి కావాల్సిన మందులు, ఆహారం సమకూర్చి
కొడవలి చేతపట్టుకుని పొలానికెళ్ళి గడ్డికోసుకొచ్చి, గడ్డి మోపుల్ని, అడవిలో దొరికిన కట్టెల్ని అమ్మకానికి పెట్టడం,
మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేసి, అమ్మతో కలిసి భోజనంచేసి ఇంటి అరుగు మీదకూర్చుని ఆమెతో కాలక్షేపంగా కబుర్లు చెప్తూ బుట్టలల్లుతూ ఉండటం .. ఇదీ ఆమె దినచర్య.  

మొగలిరేకుల గుభాలింపుల గురించి, ఆడపిల్ల అందం గురించీ ప్రపంచానికి పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉండదనుకుంటా.
దివ్య అందంగురించి ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలిసింది. ఆమెకు మంచిమంచి పెళ్ళి సంబంధాలు రాసాగాయి. అయితే తన తల్లికి తనతోడు అవసరమని, తల్లి ఇలాంటి పరిస్థితిలో ఉండగా తను పెళ్ళి చేస్కోనని ఖరాఖండిగా చెప్పింది దివ్య. కూతురు ధోరణికి బాధపడింది చింతన. తనకోసం తనకూతురు పెళ్ళి చేస్కోననటం ఆమెను చాలా దుఃఖింప చేసింది. ఆమె పెళ్ళికోసమే ఇన్నాళ్ళూ తను కలలు కన్నది. ఆమె పెళ్ళిగురించి ఆలోచించని క్షణంలేనే లేదు. కోరి సంబందాలు వస్తుంటే ఇప్పుడేమో కూతురు, పెళ్ళి చేస్కోనని మొండిచేస్తుంది. ఆమెనెలా పెళ్ళికి ఒప్పించాలా? అని ఆలోచించింది. ఆరాత్రి కన్నీట పర్యంతమౌతూ , పెళ్ళి చేస్కొమ్మని కూతుర్ని బతిమాలింది. అమ్మ మనసును అర్ధంచేస్కున్న దివ్య .. పెళ్ళికి సరేనంది. అయితే పెళ్ళైన తర్వాత తనతోపాటే  తనతల్లి కూడా ఉండటానికి ఎవరైనా ఒప్పుకుంటే పెళ్ళికి తను సిద్ధమనీ చెప్పింది. ఎలాగోలా కూతురు పెళ్ళికి ఒప్పుకోవటంతో చాలా హర్షించింది చింతన.

దివ్య .. పొలంలో పచ్చికను కోస్తుండగా .. తెల్లటి గుర్రంపై అటుగా వెళ్తున్న రాకుమారుడు ఆమెను చూసాడు. ఆమె దగ్గరికి వచ్చి చాలా దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వగలవా?అని అడిగాడు. సిగ్గు పడుతూనే ఆమె, ఒక్క నిముషం  అని, వెంటనే ఇంటివైపు దారితీసి, మరునిమిషంలో మంచినీళ్ళ కుండతో రొప్పుతూ వెనక్కి వచ్చి, అతగాడి దోసిలిలో నీరు పొయ్యసాగింది, కడుపునిండా నీళ్ళు తాగినతర్వాత అతను . ప్రపంచంలోనే అతిసుందర రూపసి, మనస్వి అయిన ఓ కన్యా .. నీ సహాయానికి చాలా చాలా ధన్యవాదములు. కేవలం ధన్యవాదం మాత్రమే చెప్పటం అంటే నా మనస్సుకి ఏదోలా ఉంది. నా బహుమతిగా ఇదిగో ఈఉంగరాన్ని స్వీకరించు.. నీకు ఇష్టమైతే నన్ను నీభర్తగా స్వాగతించు అన్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ, ఆమె తనచేతిని అతనికి అందించింది. యువరాజు ఆ ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు”. 

చప్పుడు కావటంతో ఉలిక్కిపడి లేచింది చింతన. దివ్య గడ్డికొయ్యటానికి  వెళ్ళటానికి కొడవలి తీసుకుంటూ, హఠాత్తుగా నిద్రలేచి కూర్చున్న తల్లినిచూసి అడిగింది,.. ఏమైందమ్మా! ఏమన్నాపీడ కలా?”.

హ.. లేదు లేదు .. అదేంలేదు.
చెప్దామా వద్దా అన్న సందిగ్ధంనుంచి బయటపడి, కూతురికి తనకొచ్చిన కలగురించి చెప్దామనే అనుకుంది చింతన.
చెప్తే.. చిన్నపిల్లకి అనవసరంగా ఆశలు కల్పించిన దాన్నవుతానేమో? అనుకుంది .. అయితే తెల్లవారుజామున వచ్చేకలలు నిజమౌతాయని తాను నమ్మటంతో కూతురుతో ఆ   కల గురించి చెప్పింది.

ఔనమ్మా! నాకు ఇప్పుడో కల వచ్చింది.
అడవిలో బాటగుండా వెళ్తున్న రాకుమారుడొకరు పచ్చగడ్డి కోస్తున్న నిన్ను చూసి ముచ్చటపడి, నీదగ్గరకొచ్చి మంచినీళ్ళు అడిగాడు. నువ్వు తనకోసం ఊళ్లోకి పరిగెత్తుకొచ్చిమరీ అతని దాహాన్ని తీర్చటంతో నీ మనసు అతనికి నచ్చింది. నీ వ్రేలుకు ఉంగరాన్ని తొడిగి నిన్ను పెళ్లి చేసుకున్నాడు”. కల ఎంత బాగుందనుకున్నావు? . తెల్లవారు జామున వచ్చిన కలలు తప్పక నిజమౌతాయి.  
                                          
తల్లి తనకొచ్చిన కలనిచెప్తుంటే దివ్య చెక్కిళ్ళు సిగ్గుతో కందిపోయాయి.
పోమ్మా.. పొద్దు పొద్దున్నే భలే ఆట పట్టిస్తావు .. అని సిగ్గునవ్వుతో పరిగెడుతూ అడవివైపు దారితీసింది.


అడవిలో పచ్చిక బయలు మద్యలో కూర్చుని కాసేపు, తల్లి చెప్పిన అందమైన కల గురించి పదే పదే ఆలోచిస్తూ తనలో తనే ముసిముసిగా నవ్వుకుంది.సమయం నిశ్శబ్దంగా గడిచిపోవటంతో మళ్ళీ గడ్డికోతలో నిమగ్నమైపోయింది. తను కొడవలిగిద్దతో గడ్డికోస్తుందే కానీ, మనస్సు మాత్రం అదేపనిగా ఆ రాకుమారుడి గురించే ఆలోచిచసాగింది. పరధ్యానంగానే గడ్డిని మోపుగా కట్టి నెత్తిన పెట్టుకుని వెదురు పొదలవైపు నడిచింది. రెండు పచ్చి వెదురుబొంగుల్ని నరికి గడ్డికి కిందగా మోపుచేసి నెట్టినపట్టుకుని ఇంటిబాట పట్టింది. కాస్తదూరం ముందుకెళ్ళగానే హఠాత్తున  ఎవరో పిలిచినట్లు వెనక్కి తిరిగి చూసింది.వెనక ఎవరూ లేరని నిర్ధారణ అయిన మరుక్షణం  ఆమె మనస్సు చాలా బాధపడింది. రాకుమారుడొస్తాడని , తనను పిలుస్తాడని అనుకోవటం, అలాకాకపోవటంతో దుఃఖించటం. దారి పొడుగునా ఇదేవరుస.

తననెత్తిమీద బరువుందన్న సంగతే మర్చిపోయి ఏదో మైకంలో నడుస్తున్న దానిలా ఇల్లు చేరింది, ఇంట్లో పనులు కూడా పరాధ్యానంగానే చేసింది.  ఆమెలో కలిగిన ఈవింతమార్పు ఆమె తల్లికేకాదు , ఆమెకూ  అర్ధమవుతోంది.
     
తర్వాత రోజూ అంతే ! . పనిచేస్తుందన్న మాటేకానీ పనిపై అస్సలేమాత్రమూ దృష్టిపెట్టలేదు. ఎన్నడూ లేనిది ఆమె పచ్చికమైదానంలో ఎక్కువ సమయం గడపటం మొదలెట్టింది. ఎంతో దూరంగా, ఎక్కడినుంచో వినబడుతున్న చిన్న చిన్న శబ్దాలను కూడా చాలా తీక్షణంగా చెవులు రిక్కించి మరీ వినేది .అదిగానీ గుర్రపుడెక్కల చప్పుడేమోనని.

అసలెవరో ఎక్కడుంటాడో తెలీని అతనికోసం, మంచిమంచి పెళ్లిసంబంధాల్ని కూడా కాదనుకుంది. వాళ్ళలో పెళ్ళైన తర్వాత తనతల్లిని తనతో పాటే ఉండటానికి ఒప్పుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. అయినా కాదనుకుంది. తనకలల రాకుమారుడు ఏదో ఒకరోజు తనకోసం వస్తాడని, తనని పెళ్లి చేసుకుంటాడని మనస్పూర్తిగా నమ్మింది.          
 
రోజులు గడిచిపోతున్నాయికానీ, ఆమెనుచూసి ముచ్చటపడో ,  మంచినీళ్ళిమ్మనో  ఆ అడవిగుండా ఏ రాకుమారుడూ రాలేదు.
వస్తాడో రాడో తెలీని రాకుమారుడికోసం తనెందుకిలా పిచ్చిదానిలా ఎదురుచూడాలి. ? అన్నం సరిగ్గా సహించటం లేదు, ఏ విషయం మీదా మనస్సు సరిగ్గా నిలవటం లేదు. నిద్ర లేచినా , పడుకున్నా, పని చేస్తున్నా, ఏకాంతంగాఉన్నా ఎలా అయినా సరే అతడిగురించే తనెందుకిలా ఆలోచించాలి? అని అనుకుంది. ఇకపై ఆ రాకుమారుడి గురించి ఆలోచించనని ఒట్టు పెట్టుకుంది. మనస్సుల్లో గుబులు పడుతూనే,అతడిని గురించిన ఆలోచనల్ని మెదడులోకి రానివ్వకుండా ఉండాలనుకుంది.

యధావిధిగా ఆరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచిన దివ్య. తనతల్లికి అన్నీ సమకూర్చి, ముంగిట వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, చెక్కపెట్టె కిందనున్న కొడవలిగిద్దని తీసుకుని , గడ్డికోత కోసం అడవివైపు నడిచింది. శీతాకాలమే అయినా ఆరోజు చలి కాస్త ఎక్కువగానే ఉంది.అడవిలోకి వెళ్తూ వెళ్తూ ఈరోజు రాకుమారుడొస్తాడేమో? అనుకుంది.

ఛ. .ఛ . . నాకేం బుద్దిలేదా? అతడి గురించి ఆలోచించని ఒట్టు పెట్టుకుని కూడా ఆలోచించటానికి? అనుకుంది.
అయినా తను ఇప్పుడేం ఆలోచించిందని ? రాకుమారుడొస్తాడేమో? అనుకుంది. అంతేగా.?
రాకుమారుడొస్తాడేమో? అనుకోవటం, రాకుమారుడికోసం ఆలోచించటం ఎలా అవుతుంది. చివరికి తను రాకుమారుడికోసం ఆలోచించట్లేదనే భావనకి వచ్చింది.

బల్లపరుపుగా ఉన్న పచ్చిక మైదానపు అంచున కూర్చుని మెత్తగాఉన్న పచ్చికను కొయ్యసాగింది.
దూరంగా గుర్రపు డెక్కల శబ్దం వినబడింది. రాకుమారుడి గుర్రపు డెక్కల శబ్ధమనుకుంటా? అనుకుంది.
అయినా తను రాకుమారుడిగురించే ఆలోచించనప్పుడు అతడి గుర్రపు డెక్కల శబ్ధం తనకెలా వినిపిస్తుంది?అనుకుంది.
అసలు తను ఏ శబ్ధమూ వినలేదనే నిర్ధారణకి వచ్చింది.

ఇంకో గుప్పెడు పచ్చిగడ్డిని కోసి, మరోసారి చెవులను రిక్కించింది. దూరంగా కొండ చివరలనుంచి వెదురు పొదల మధ్యగా వీస్తున్నగాలి, ఊల శబ్ధంవినిపించింది. చిన్నగా తనలో తనే నవ్వుకుంది. మరో గుప్పెడు గడ్డిని కోసి పక్కనున్న మేటలో వెయ్యబోయింది. ఈసారి కాస్త దగ్గరగా గుర్రపు డెక్కల టకటకలు వినపడటంతో నిజంగానే రాకుమారుడొచ్చాడేమో? అనుకుంది.

వస్తే వస్తాడు అయితే తనకేమిటి? ఇంతవరకూ వచ్చినవాడు. ఇక్కడికి రాకపోడా? వచ్చి పిలవకపోడా?
అయినా రేయింబవళ్ళు తనే అతడిగురించి ఆలోచిచాలా? తనకోసం అతడేమీ చెయ్యడా అనుకుంది.                  

గుర్రపు డెక్కల చప్పుడు ఉండుండి బిగ్గరగా పెరిగి మరీదగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఓ మనిషి అడుగుల చప్పుడు మాత్రం ఆమె వైపు రావటం స్పష్టంగా వినపడింది. తర్వాత ఆమె వెనకాలే ఠీవిగా నిలబడి ఉన్న అతడి చూపుల్నిఆమె వీపు వెచ్చగా గ్రహించింది. ఆమె భారంగా అలా నిలబడి ఉండిపోయింది. అతను ఆమెకి మరికాస్త దగ్గరగా వచ్చాడు. తను వచ్చిన విషయాన్ని ఆమెకు తెలియ చెప్పటానికన్నట్టు చిన్నగా గొంతు సవరించుకుంటూ చిన్నగా దగ్గాడు. ఇన్నాళ్ళ తననిరీక్షణ ఫలించిందన్న భావనతో, ఆమెఒళ్ళు అప్రయత్నంగా జలదరించింది. సిగ్గుతో తలవంచుకుని, అతని వైపు తిరిగింది.
నీనుంచి నాకు కాస్త సహాయం కావాలి అన్నాడతను.
ఏమిటో చెప్పండి.. అని తలదించుకునే బదులిచ్చిందామె.
నేను కళింగ యువరాజుని , కోసలదేశాన విద్యనభ్యసించి, మా దేశానికి తిరిగి వెళ్తున్నాను. నాతో బాటుగా తెచ్చుకున్న మంచినీళ్ళు అయిపోయాయి. చాలా దాహంగా ఉంది. కాస్త మంచినీళ్ళు ఇవ్వగలవా? అని అడిగాడు.

మృదువైన అతని మాటలు ఆమె చెవుల్ని సోకగానే, ఆమె కళ్ళు తనకు తెలీయకుండానే  వర్షించటానికి సిద్దమైపోయాయ్. ఉదయభానుడి కిరణాలు సోకగానే అప్పుడే విడుస్తున్న కమలాల్లా ఉన్న ఆమెకళ్ళు నెమ్మదిగా విచ్చుకున్నాయి. మెల్లగా తలపైకెత్తి అతని మొహంలోకి చూసింది. ఆమె అతన్ని చూడకుండానే వలచింది., కానీ ఆమె వలచినతర్వాత ఆమె అతన్ని చూసిన తొలిచూపు అది. అతడిని మరీ అంత దగ్గరగా చూడటం వల్లనేమో ఆమె గుండె తుళ్ళిపడుతూ,వేగంగా కొట్టుకోసాగింది.
అదేసమయంలో అతడూ ఆమెను చూసాడు. ఇద్దరి చూపులూ క్షణకాలం కలుసుకున్నాయి. కళ్ళు మూస్తే ఆ దివ్యస్వరూపాన్ని అరలిప్తపాటు సమయం,ఎక్కడ చూడకుండా ఉండాలో అని బాధపడుతున్నవాడి మల్లే అతడు రెప్పమరల్చకుండా ఉండి పోయాడు. అతడలానే చూస్తూ ఉండటంతో చటుక్కున తలదించేసుకుంది.

సిగ్గుతో అదురుతున్న పెదవులతో..  కాస్త సమయం ఓపిక పట్టగలనంటే దగ్గరలోని తండాలోనే మా ఇల్లు ఉంది. వెళ్లి మీరు తాగేందుకు మంచినీళ్ళు పట్టుకొస్తాను అందామె.
సరేనని బదులిచ్చాడతడు.

అతని కనుచూపు సోకేంతవరకూ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్లి, తర్వాత వడి వడిగా అంగలేసుకుంటూ ఇల్లు చేరుకుంది. ఇంట్లో మట్టికుండని తీసుకుని మహానదీ తీరానికెళ్ళింది. కుండని బాగా కడిగి నిండుగా నీళ్ళు పట్టి అడవిబాట పట్టింది. వెళ్తున్నంత సేపు లిప్తపాటుగా చూసిన అతని మొహాన్నే పదేపదే గుర్తు చేసుకోసాగింది. మెలమెల్లగా అడుగులేసుకుంటూ అతన్ని సమీపించింది. ఆమె అతన్ని చేరుకోగానే, అతను వినయంగా వంగి దోసిలి పట్టాడు. మెల్లగా కుండని వంచుతూ నీళ్ళని అతని దోసిలిలో పోయ్యసాగిందామె. నెమ్మదిగా, నిదానంగా ఆమె కళ్ళలోకి చూస్తూ కడుపునిండా నీళ్ళు తాగి దాహార్తిని తీర్చుకున్నాడతను. కృతజ్ఞతగా ఆమెను చూసాడు. అతడేదో చెప్పాలనుకుంటున్న సంగతిని గ్రహించి ఏమిటన్నట్టు కళ్ళతో సైగచేసిందామె.
నువ్వు చేసిన ఈ ఉపకారానికి చాలా ధన్యవాదాలు. కేవలం ధన్యవాదాలు ఒక్కటే నీతో చెప్పేవికాదు.
నాతరుపున ఈ ముత్యాలహారం స్వీకరించు. దీనివిలువ పదివేల వరహాలు. అన్నాడతను.

మీ ధన్యవాదాలకి ప్రతి ధన్యవాదాలు. కేవలం ధన్యవాదాలతో సరిపెట్టకుండా, ఏదైనా బహుమతినిద్దామనే మీ ఆలోచన బాగుంది. అయితే అర్ధవరహా విలువచేసే కుండనీళ్ళకి, పదివేల వరహాల ముత్యాల హారపు సత్కారమెందుకో నాకర్ధం కావట్లేదు అంది కరుకుగా.
అతడికి తనుచేసిన తప్పేమిటో తెలిసొచ్చింది.విలువ చెప్పినందుకు మన్నించు. బహుమతిని  విలువపరంగా కాక వస్తువుగా స్వీకరించు.నాతో పాటూ నా గుర్రంకూడా అలసిపోయింది. బహుసా దానికి ఆకలేస్తూ ఉండి ఉండొచ్చు. నీ దగ్గర ఉన్న ఆ గడ్డి మోపు దానికి ఆహారంగా ఇచ్చేయ్. నీకు బహుమతిగా తీసుకోవటం ఇష్టంలేకపోతే , బదులు వస్తువుగా  ఈ ఉంగరాన్నికూడా తీస్కో అన్నాడు అతను.

మీ దగ్గర్నుంచి ముత్యాలహారాలు, నవరత్నఖజిత ఉంగరాలు ఆశించి నేను ఇదంతా చెయ్యలేదు యువరాజా..!
మీకోసం ఏదన్నా చెయ్యాలనిపించి చేసాను. మీ ఉంగరం నాకేమీ వద్దు. మీగుర్రానికి ఆహారంగా, ఇదిగో ఈ గడ్డిమోపును తీసుకోండి. అని గడ్డిమోపుని అతని చేతిలో పెట్టింది.

ఎప్పుడూ ఇవ్వటమే కానీ, తీస్కోవటం తెలీదు. అలాంటిది నీ దగ్గర్నుంచి సహాయాన్ని పొంది నీకేమీ చెయ్యలేకపోయాననే బాధ నాకొద్దు. దయచేసి ఏమి కావాలో అడుగు. నేను నీకేవిధంగా సహాయం చెయ్యగలనో చెప్పు.. అని అడిగాడు అతడు.

తప్పకుండా యువరాజా !  నాకేమి కావాలో అది మీరు మాత్రమే ఇవ్వగలరు. మీరు ఇవ్వాలనుకుంటే దాన్ని పొందేదాన్ని నేను తప్ప మరెవరూ కాదు. అని సమాధానమిచ్చి సిగ్గుతో నవ్వింది తను.

అతనూ చిరునవ్వు నవ్వాడు. నీ కోరికని  గ్రహించాను సుకుమారీ! నేను కళింగ పట్టణం చేరుకున్నాకా, అంటే ఇప్పటికి సరిగ్గా మూడురోజుల లోపు నీకు సందేశాన్ని పంపిస్తాను. దానికి బదులివ్వు చాలు .. అని నవ్వుతూ తన గుర్రపుఉట్టులో కాస్తగడ్డి నుంచి గుర్రాన్ని వెనక్కి అదిలించి తన దారిన తాను తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

మూడురోజులు..  ప్రతీ క్షణం  అతని సందేశం గురించే ఆలోచించసాగింది.  అతను సందేశాన్నైతే పంపిస్తానన్నాడు గానీ , ఎలా పంపిస్తాడో చెప్పలేదు. దూత ద్వారానే పంపుతాడా ? సందేశమన్నాకా దూతద్వారానే పంపాలి. వేరే గత్యంతరం లేదు. కానీ ఆ దూత ఎవరు ? మేఘమా ?, ఎవరైనా ఈ ప్రాంతం లో వ్యాపారం చేసుకునే వర్తకుడా ? లేకపోతే ఏదైనా పక్షా ? తన సందేశాన్ని అసలెలా పంపిస్తాడు?  అతగాడు పంపించేది ప్రేమలేఖే అయితే,?.. అసలెలా రాస్తాడో?  

ఇంటిబయట ఏ చిన్న అలికిడైనా దూత సందేశాన్ని తెచ్చారేమోనని భావించి ఒక్క ఉదుటున బయటకు వచ్చేది.  ఆ మూడురోజులూ ఆమెకు  తిండి సహించలేదు. నిద్ర పట్టలేదు. అదే విషయాన్ని ఆలోచించి ఆలోచించి నీరసించి పోయింది. అతడు చెప్పిన మూడురోజుల  గడువు ఆ రాత్రితో తీరిపోనుంది. బహుసా అతడు తనని గురించే మర్చిపోయుండొచ్చనుకుంది. దీపాలవేళ వరకూ ధైర్యంగానే ఉంది. తర్వాత మనసుపొరల లోలోపల్నుంచీ తన్నుకొస్తున్న బాధని , కల్ల కలుగుల్లోంచి ధారలు కడుతున్న కన్నీటినీ ఆపటం ఆతర్వాత ఆమెకు చేత కాలేదు. బాధతో గుండెలు బరువెక్కాయి.. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడుస్తూనే నిద్రపోయింది.


ఆమె నిద్ర పోయిన సరిగ్గా పావుగంటకి. సందేశాన్ని మోసుకుని వచ్చిందొక రాచకపోతం. తల్లికి కాస్త ఎడంగా నిద్రపోతున్న ఆమెని చూసింది. మెల మెల్లగా ఆమెను నిద్ర లేపేప్రయత్నాలు చెయ్యటం మొదలెట్టింది. ఆమె పడుకున్న కిటికీ పక్కగా వచ్చి కువకువలు చెయ్యటం మొదలెట్టింది. ఏడ్చి ఏడ్చి నీరసించి నిద్రపోవటం వళ్ళ ఆమె గాఢనిద్రలో ఉంది. ఇంటి బయటికెళ్ళి ఒక రాయిని నోట కరిచి తెచ్చి ఆమె మీద పడేసింది. ఆమె కాస్త కదిలింది కానీ నిద్ర లేవలేదు.

ఆ కపోతం, యువరాజు ఆజ్నని గుర్తుకు తెచ్చుకుంది.
చూడు మిత్రమా! నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆమెకు చేరవేయాలి, అంతేకాదు ఆమె సమాధానాన్ని తీసుకుని గడువులోపు క్షేమంగా నన్ను చేరుకోవాలి. నీ ప్రయాణం రాత్రిపూట జరిగితేనే నీకు శ్రేయస్కరం. ఎందుకంటే వేటగాళ్ళ కళ్ళు ఎప్పుడూ రాచకపోతాల మీదనే ఉంటాయి. పైగా నువ్వెల్లేది అటవీప్రాంతం, రాబందులు , గ్రద్దలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. మధ్యలో ఎక్కడా కిందికి దిగకు .ప్రమాదానికి ఎదురెళ్ళకు. నీప్రాణం జాగ్రత్త సుమా.. నువ్వందించే  సందేశం మీదే మా భవిష్యత్తులు ముడిపడి ఉన్నాయి. ఆలస్యం చెయ్యకు.

ఆ రాచకపోతం ఎప్పుడైతే యువరాజు మాటల్ని మననం చేసుకుందో, తను ఎలాగైనా ఈ రాత్రిలోపు బదులు సందేశాన్నితీసుకుని తిరిగి కళింగరాజ్యం చేరుకోవాలని అనుకుంది.తన రెక్కలతో ఆఇంటి దుబ్బులచూరుని టపటపా కొట్టింది. అయినా ప్రయోజనం లేదు. చివరి ప్రయత్నంగా తను ఆమె మీద వాలి నిద్రలేపాలనుకుంది. దగ్గరకి చేర్చబడిఉన్న తలుపుల మద్య ఖాళీలోంచి లోపలికి వెళ్దామని ఆఇంటి గుమ్మం దగ్గర వాలింది. మెల్లగా లోనికి దూరింది. ఆమె చేతిని తన ముక్కు కొనలతో మెలమెల్లగా స్పృశించింది.ఆమెలో కాస్త చలనం కలిగింది. ఇంతలో అదునుకోసం నక్కి నక్కి చూస్తున్న అడవిపిల్లి దబ్బున పావురం మీదికి దూకి ఆ పక్కనున్న చెక్కపెట్టె కిందికి పావురాన్ని లాక్కుపోయింది. పావురానికి ప్రతిఘటించే అవకాన్ని కొంచెం కూడా ఇవ్వలేదు. అలవాటైన కర్కశత్వంతో పావురం మెడని కొరికి , పావురం విగతజీవి అయిన తర్వాత దాన్ని ముక్కముక్కలుగా కొరికి పావురం మొండాన్ని తనపళ్ళతో కరచుకు పెట్టుకుని దుబ్బుపొదల చాటుకి దారితీసింది.

తెల్లవారింది. ఎప్పుడూ లేనిది దివ్య.. బారుడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉంది. ఎప్పుడూ ఉదయాన్నే నిద్రలేచి అన్నిపనులూ చక్కపెట్టుకునే అమ్మాయి ఇంకా నిద్రలేకపోవటంతో చింతన మనస్సు ఎందుకో కీడుశంకించింది. దివ్యని నిద్రలేపుదామని ఆమె దగ్గరగా వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న దివ్యను చూసి ఆమె భయకంపితురాలైపోయింది. మూడు రోజులుగా అదోరకంగా ఉన్న దివ్య మానసికంగా బెంగపెట్టుకుని ఏదో చేసుకుందనే ఆమె అనుకుంది.ఆమె కుప్పకూలిపోయింది.గుండెలు పగిలేలా ఆమె శోకాలు పెడుతుందే కానీ, ఆమె ఏడుపు తాలూకు శబ్ధం ఆమె గొంతుక దాటి బయటకు రావట్లేదు. తన కూతురుకోసం ఆ తల్లిహృదయం తల్లడిల్లిపోయింది. గుండెలు బాదుకుంటూ  వెక్కి వెక్కి ఏడ్వసాగింది. నిద్రలోకి అదోలా వినపడుతున్న తన తల్లి ఏడుపు దివ్యను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది.
ఏమయ్యిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్ ? కంగారు పడుతూ అడిగింది దివ్య.
తనకూతురికి ఏమీ కాలేదన్న సంతోషంతో కూతుర్ని గట్టిగా పట్టుకుని మరోసారి భోరుమంది చింతన.

 “పొద్దెక్కినా ఇంకా నువ్వు లేవలేదని, నిన్ను లేపుదామని చూసాను. రక్తం మడుగులో ఉన్న నిన్ను చూసే సరికి నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. కాస్త మనసు కుదుట పడ్డాకా,.. ఇంకా తగ్గని గుండె దడతో రొప్పుతూనే  కూతురుతో జరిగింది చెప్పింది.

అప్పడు గమనించింది దివ్య, చెక్క పెట్టె కిందినుంచి ఇల్లంతా పాకిన రక్తపు ధారల్ని . ధైర్యం తెచ్చుకుని చెక్కపెట్టెను కాస్త వెనక్కి జరిపింది.  రక్తపు మడుగులో ఉన్న రాచకపోతపు మాంసపు ముద్దలు,  ఆ పావురాయి కాళ్ళు .. కాళ్ళకి కట్టి ఉన్న ఉత్తరం భయంకరంగా కనిపించాయి.రక్తంతో తడిసిన ఉత్తరాన్ని వణుకుతున్న తనచేతిలోకి తీసుకుంది దివ్య.

అందులో ఇలా రాసి ఉంది.

సమస్త సృష్టిలో ప్రత్యేకమైన,బహుసుందరమైన, సద్గుణ సంపన్న నారీ ! ఓ  ప్రియతమా, నా ప్రేయసీ..
ఇంకా వర్ణించాలని ఉంది, కానీ వర్ణనలకి ఇది తగిన సమయం కాదు.  నేను  మాత్రమే నీకు ఇవ్వగల్గినది. నేను ఇస్తే నువ్వు పొంద గల్గేది ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమిస్తాను కూడా . నీకిష్టం అయితే ఈ యువరాజుకు తగ్గ యువరాణిగా మారటానికి నీకు అభ్యంతరం లేకపోతే  నేను నా భార్యగా నిన్ను పొందాలనుకుంటున్నాను.ఈ పావురంతోనే తిగుగువేగులో సమాధానం పంపు. ఎందుకంటే నాన్నగారు నాపెళ్లి ప్రసక్తి రేపుసభలో తీసుకురానున్నారు.
నీ సమాధానం అనుకూలంగా ఉంటే ఆయనతో మాట్లాడి వెంటనే పల్లకిని పంపిస్తాను, నీ నుంచి ఏసమాధానమూ లేనట్లయితే ఆయన ఇష్ట ప్రకారం నేను నడుచుకోవాల్సి వస్తుంది . నా మనసుని అర్ధం చేసుకుంటావని,శుభ సమాచారాన్ని , సందేశాన్ని ఆశిస్తూ ..      

నీ              
యువరాజు
రాజ్యం కళింగ.
                       
ఉత్తరాన్ని చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. నీటితోనిండిపోయిన కళ్ళను మరోసారి తుడుచుకుంది. చెక్కిళ్ళ మీదుగా ధారలు కడుతున్న కన్నీటిని కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండానే ఉత్తరాన్ని మరోసారి చదివింది. తనకిప్రేమ సందేశాన్నిఅందిచటానికి రాయబారిగా వచ్చి రక్తపు మడుగులో ప్రాణం కోల్పోయిన పావురాన్ని తల్చుకుంది. దాంతోపాటే తన యువరాజు పెళ్ళికి ఈరోజు మాటలు జరగబోతున్నాయన్న విషయాన్నికూడా. ఎక్కడ కళింగ, ఎక్కడ సెరంగడ ?. యువరాజు తనని ప్రేమిస్తున్నాడనే విషయాన్నైతే తెలుసుకోగల్గింది కానీ ఆ ప్రేమను ఎలా సాధించుకోవాలో, అతన్ని ఎలా చేరుకోవాలో ఆమెకు తెలిసింది కాదు.ఈసారి ఏడవటానికి కూడా ఓపిక లేదన్నట్టుగా ఉత్తరాన్ని జారవిడిచింది. ఉత్తరంకంటే ముందు తనే నిస్పృహగా నేలని తాకింది.   

ఈసారి దివ్యతల్లి ఏడవటం, గుండెలు బాదుకుని రోధించటంలాంటివి ఏమీ చెయ్యలేదు.
తనకూతుర్ని ఒడిలో పడుకోపెట్టుకుని లాలిద్దామనుకుంది.వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను ఓదార్చుదామనుకుంది.
తను లాలిపాడనవసరం లేకుండానే కూతురు గాఢనిద్రలోకి జారుకోవటంతో, తనకుతనే జోలపాడుకుంది.
కూతురి నుదుటిపై ముద్దు పెట్టుకుని, తనూ కళ్ళు మూసుకుంది. స్వచ్చమైన , శాశ్వతమైన నిద్రలోకి తనూ కూతురుతో కలిసి జారిపోయింది.

_____________________________________________________________________________________
THANK YOU.. 

 
చాసీజియా రాజపువా 
పేదమ్మాయి- రాజకుమారుడు  
( ఒరియా- కథ )
కబుర్లలో నా కొలీగ్ సుధాంశు చెప్పిన కథ ఇది.
నాకు అర్ధమైన కథకి..  తెలుగు అక్షర రూపం. దీన్ని అనువాదకథ అనొచ్చోలేదో కూడా నాకు తెలీదు. 
కాపీరైట్ సమస్యలేమీ ఉండవనే అనుకుంటున్నాను .  అలాంటివి ఏమైనా ఉంటే తెలియచేస్తే
ఇక్కడనుంచి తొలగిస్తాను..

Sunday, July 15, 2012

అమ్మచెట్టు( ఒరియా అనువాదకథ )


ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం వర్షం పడుతుందేమో అనిపిస్తుంది.
ఆ ఊళ్ళో,  ఏటి ఒడ్డున,  విశాలమైన మైదానం మద్యలో ఒక చెట్టు ఉంది.
అక్కడికి రోజూ సాయంత్రాలు చాలా మంది పిల్లలు ఆడుకునేందుకు వచ్చేవారు. కల్లాకపటంలేని నవ్వులతో సందడి చేసేవారు. ఒకరోజు అలా ఆడుకోవటానికి అందరిలానే ఓపిల్లాడు వచ్చాడు, అలసట తీర్చుకునేందుకు ఆచెట్టు నీడన కూర్చున్నాడు. అలసట తీరాకా ఆచెట్టుని పరీక్షగా చూడటం మొదలుపెట్టాడు.చెట్టుమొదలు దగ్గర రాలిపడిఉన్న పళ్ళను తీసుకుతిన్నాడు. ఆచెట్టు బెరడు మీద కాలేసి కొమ్మమీద కూర్చుని పైకొమ్మకి కాసిన పూలని, పిందెల్ని,కాయల్ని,పళ్ళని కళ్ళతో పరామర్శించాడు. తర్వాత కొమ్మను పట్టుకు వేలాడి, కిందికి దూకాడు. మనసుకు బాగుందనిపించటంతో మళ్ళీ చెట్టెక్కి మళ్ళీ దూకాడు. ఆ తర్వాత మళ్ళీచెట్టెక్కి ఈకొమ్మమీదినుంచి ఆకొమ్మమీదికి, ఆకొమ్మమీదినుంచి  ఈకొమ్మమీదికి ఉరుకుతూ కాసేపు కాలక్షేపం చేసాడు. ఇంతలో తోటి పిల్లలు, ఆటలు ముగించుకుని ఇంటిదారి పట్టడం చూసి, మెల్లగా చెట్టుదిగి తనూ ఆటలు కట్టిపెట్టి ఇంటిముఖం పట్టాడు.

తర్వాతి రోజు ఉదయాన  పుస్తకాలసంచినొకదానిని వీపుకు తగిలించుకుని ఆపిల్లాడు చెట్టుదగ్గరికి చేరుకున్నాడు. చెట్టునుంచి వీస్తున్న చల్లటి ఉదయపుగాలిని గుండెలనిండా పీల్చుకున్నాడు. నేలమీద రాలిపడ్డ పండుని తీసుకునితింటూ, కిందనున్న  బెరడుకి సంచిని తగిలించి, జాగ్రత్తగా చెట్టు ఎక్కాడు. చెట్టుకొమ్మ మీదినుంచి కాళ్ళు కిందికి వ్రేలాడేసి, మెల్లగా వాటిని  ఊపుతూ పండుని తింటూ,  ప్రపంచంలో తనుకనుగొన్న ఈ ప్రశాంతమైన చోటుని మరోసారి కళ్ళలో నింపుకున్నాడు. ఇంతలో బడి గంట చప్పుడు వినబడగానే, ఒక ఉదుటున కొమ్మ మీదినుంచి కిందికి దూకేసి , పుస్తకాలసంచి తీసుకుని బడివైపు పరిగెత్తాడు.ఆ మద్యాహ్నం భోజన విరామంలో మళ్ళీ చెట్టుదగ్గరకి వెళ్లి కాసేపు కూర్చున్నాడు. మళ్ళీ సాయంత్రం బడినుంచి ఇంటికి వెళ్ళేప్పుడు ఆచెట్టు దగ్గర కాసేపు ఆడుకుని ఇంటికెళ్ళి పోయాడు. మరుసటి  రోజూ ఇదే వరుస. ఆ తర్వాత రోజునుంచి ఆ పిల్లానికి ఇదే దినచర్యగా మారిపోయింది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెట్టు దగ్గరే కాలక్షేపం చెయ్యటం మొదలెట్టాడు.

పిల్లవాడి ఆటల్ని, సంతోషాన్ని చూసి చెట్టు మురిసిపోసాగింది.
ఆ పిల్లాడిని తన కొడుకుగా, తనని అతడి తల్లిగా భావించుకుంది. ప్రతీ రోజూ తనపిల్లాడి కోసం ఎదురుచూసేది .
రాగానే కొమ్మలూపి చల్లటిగాలిని విసిరేది . ఆకలిని తీర్చేందుకు పళ్ళని రాల్చి సిద్దంగా ఉంచేది. కొమ్మ మీద ఆ పిల్లాడు పడుకున్నప్పుడు నెమ్మదిగా జోలపాడేది. తటాలున ఒక్క ఉదుటున అతను దూకి ఇంటికెళ్ళి పోయేప్పుడు బాధ పడేది. అలా దూకేప్పుడు అతనికి ఏమైనా దెబ్బలు తగులుతాయేమోనన్న భయంతో తన కొమ్మల్ని  భూమికి దగ్గరగా వంచేది.
ఒక్క పూట వాడు కనిపించక పోయినా తల్లడిల్లి పోయేది. 
   

రోజులు.. సంవత్సరాలు గడిచి పోయాయి.
పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు. బడినుంచి హైస్కూలుకొచ్చాడు. రోజూ సాయంత్రం మాత్రం ఆచెట్టు నీడన కూర్చుని కాసిన్ని పళ్ళని తిని, కాస్త కాలక్షేపం చేసి వెళ్తుండేవాడు. ఇంకొన్ని రోజులు గడిచాయి .. రాకపోకలు మరికాస్త తగ్గాయి. ఎప్పుడైనా పని మీద అటుగా వెళ్తున్నప్పుడు ఒక్కోసారి వచ్చి చెట్టు నీడన కూర్చునేవాడు. మరికొన్ని రోజులు గడిచాయి , వారానికో రెండు వారాలకో , లేకపోతే నెలకో .. వచ్చి చూసి వెళ్తుండేవాడు .

ఎప్పుడూ తనదగ్గర కూర్చుని కబుర్లు చెప్పే కొడుకు , ఇంతలా ఎందుకు మారిపోయాడా అని తనలో తానూ చాలా బాధపడింది చెట్టు. తన దగ్గర కూర్చోవటం, కబుర్లు చెప్పటం మాట అలాఉంచి కనీసం మొహాన్నైనా చూపించట్లేదని వ్యాకులత చెందింది.
ఆ తర్వాత ఎప్పుడో అతగాడు వచ్చినప్పుడు అదే విషయాన్ని అడిగింది .అంతకుముందు ఎప్పుడూ ఈ అమ్మదగ్గరే కూర్చుని, బోలెడు కబుర్లు చెప్పేవాడివి. ఏమయ్యింది నాన్నా! ఈ మధ్య అసలు రావటం కూడా మానేశావ్ ? అని.

అలాంటిదేమీ లేదు.  కాలేజీ కదా ! . కాస్త  బిజీ, బిజీగా రోజులు మారిపోయాయి. అవి చదవాలి , ఇవి చదవాలి అని .ఒకటే ఆలోచనలు. అందుకోసమే కుదరట్లేదు.

ఎప్పుడూ చదువు చదువు అని , ఎక్కువ గాబరా పడకమ్మా , సమయానికి తినటం పడుకోవటం లాంటివి కూడా చెయ్యి .
మొహం చూడు , ఎలా పీక్కుపోయిందో అని , కాసిన్ని పళ్ళని అతని చేతికి దగ్గరగా జార్చింది.

ఆ ఆ ..  అలాగలాగే అని చెప్పి, పళ్ళను తీసుకుని, అతను , అక్కడినుంచి వెళ్ళిపోయాడు .

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి గానీ అతడు  అటుగా వెళ్ళలేదు. ఆ చెట్టుకి కనిపించలేదు . రోడ్డు మీదుగా నడిచి వెళ్తున్న అతన్ని చూసి తనే ఆప్యాయంగా కేక వేసింది..
అతని జుట్టు పెరిగిపోయి ఉంది . కళ్ళు లోపలికి వెళ్లిపోయాయి  

ఏంటమ్మా ? ఇలా అయిపోయావ్ ? ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అని అడిగింది.

ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఉన్న అతను చటుక్కున ఈ లోకానికి వచ్చినట్టు, సన్నగా కంపించి ,
కాసిన్ని డబ్బులు అవసరం పడ్డాయి . నా దగ్గర డబ్బులే కాదు , చేసేందుకు ఏపనీలేదుఅన్నాడు.

నాకెప్పుడూ ఇలాంటి అవసరం రాలేదు . ఆ మాటకొస్తే డబ్బులెలా ఉంటాయో కూడా నాకు తెలీదు. నీకు డబ్బులు సమకూర్చటానికి నేను ఏమి చెయ్యగలనో కూడా నాకు అర్ధం కావట్లేదు . పూలు పండ్లు తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను.
ఒకవేళ వాటిని అమ్మి, సొమ్ము చేసుకోగలను అనుకుంటే .. నా పూలని, పళ్ళని కోసుకునెల్లి ఏదైనా వ్యాపారం చేస్కో .. అంది చెట్టు.

ఆమాట వినబడటమే ఆలస్యం.. చెట్టుకున్న కాయలన్నింటినీ కోసేసుకుని, వెళ్లి అమ్ముకుని సోమ్ముచేసుకున్నాడు.
కాయలు కోసేప్పుడు, అడ్డొచ్చిన చిలవల్నీ, పలవల్నీ కూడా తెంపేశాడు.  అప్పుడు కొంచెం బాధ పడినా, నా కొడుకు కోసమేకదా ఇదంతా అని ఆనందపడింది చెట్టు.

ఇంకొన్ని రోజులుగడిచాయి. ఋతువులు మారాయి . ఓ వర్షాకాలపు మద్యాహ్నం హోరున వర్షంలో తడుస్తూ , ఆచెట్టు కింద తల దాచుకోవటానికి వచ్చాడు అతడు. చాలా రోజులు తర్వాత కొడుకుని చూసానన్న సంతోషంలో, కంటతడి పెట్టుకుంది.  కొడుకు తన కన్నీళ్ళను చూసి ఎక్కడ బాధపడతాడోనన్న భయంతో, వర్షపు చినుకుల ధారలతో మొహాన్ని కడిగేసుకుంది.
అయినా అతని మొహం దీనంగా, బాధగా ఉండటం తను గమనించింది. అతని మోహంలో దిగులుభావాన్ని చూడలేనన్నట్టుగా, బెంగపడి అడిగింది.. ఎందుకమ్మా ? , అలా దిగులుగా ఉన్నావ్ ? అని.

కాలాలు మారిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినా నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది.
తలదాచుకోవటానికి ఇల్లుకూడా లేదు. వానాకాలం వచ్చిందంటే చాలు నా అవస్థలు చెప్పనలవి కావు.... ... బాధని గొంతులో ధ్వనింప చేస్తూ అతగాడు చెప్పుకుపోతున్నాడు.

కొడుకు కష్టానికి మరికొన్ని కన్నీళ్ళను కార్చింది. అతని బాధని పోగొట్టటానికి తనేం చెయ్యగలనా అని ఆలోచించింది. ఓదార్పుగా చెప్పటం మొదలుపెట్టింది. ఇల్లు .. ఇల్లంటే ఏంటో నాకుతెలీదు. ఒంటరిగా ఎండకు ఎండి, వానకు నాని, చలికి వణకటం తప్ప .. నిజంగా ఇల్లంటే ఏంటో నాకు తెలీదు. కానీ నువ్వు నాలా కాదుగా . నీకు కొన్ని బరువు భాద్యతలున్నాయ్. కుటుంబం ఉంది. వాళ్ళను కాపాడుకోవటానికైనా నీకు ఇల్లు కావాలి. ఈవిషయంలో, నావల్ల నీకేదైనా ఉపయోగం జరుగుతుందేమో ఆలోచించు. నాకు పెద్ద పెద్దకొమ్మలున్నాయి.అవి నీఇంటికి వాసాలుగా బహుశా ఉపయోగపడొచ్చనుకుంటా!
వాటిని తీసుకెళ్ళి ఇళ్ళు కట్టుకో అంది.

మరుక్షణమే.. అతను చెట్టెక్కాడు. యే యే కొమ్మలు ఎలా ఎలా ఉపయోగ పడతాయో అని ఆ కొమ్మ మీదినుంచి ఈ కొమ్మ మీదికి దూకుతూ ఆలోచించాడు.
అతడు చిన్నపిల్లాడిగా ఉయ్యాలలూగటం, కొమ్మల్ని పట్టుకు వేలాడటం. కొమ్మమీది నుంచి నేలమీదికి దూకటం. అతనికి ఎక్కడ దెబ్బలు తగుల్తాయోనని తను గాబరాపడటం, కాస్త నేలబారుగా వంగి అతన్ని సురక్షితంగా కిందికి దించటం. వెళ్ళేప్పుడు తింటూ వెళ్ళమని పండ్లని , అతని చేతుల్లోకి జార్చటం ఒక దానివెంట ఒకటి , తన మాతృత్వపు ఒడి జ్ఞాపకాలు గుర్తొచ్చి, ఆ చెట్టుకళ్ళు అప్రయత్నంగా తడి అయ్యాయి.

గొడ్డలితో కొమ్మల్ని నరకటం మొదలెట్టాడతను. వాసాలకోసం బలమైన కొమ్మలు , దూలాలకోసం పొడవాటి కొమ్మలు, ఇంటి చుట్టూ కంచె కోసం, నిట్రాడులకోసం .. ఇలా తనఅవసరానికి కి పనికి వస్తుందనుకున్న  ప్రతీ కొమ్మా నరికాడు. చివరకికి కొమ్మలులేని మోడు ఒక్కటి మిగిలింది. ఈక్షణం చెట్టు బాధపడలేదు, తన ప్రతీ కొమ్మా కొడుకుకి ఎంతగా అవసరమో ఆలోచించింది. కొమ్మల్ని నరుక్కుని వెళ్తున్న కొడుక్కి కొమ్మలూపి టాటా చెప్దామనుకుంది. అది తన వళ్ళకాదని తెలిసిన మరుక్షణం నిండు గుండె తో అతనికి మంచిజరగాలని కోరుకుంది.

ఆకులు కొమ్మలు లేక, చెట్టు ఆహారాన్ని సమకూర్చుకోలేకపోయింది. చిక్కి నీరసించి పోయింది. మోడుబారటం అనే ప్రక్రియను మొదటిసారి అనుభవించింది. అంతలో అటుగా కొడుకు వచ్చాడు. చూసి చాలా చాలా సంతోసించింది. తనకడుపు ఆకలితో మాడిపోతున్నా  కొడుకు ఆకలి తీర్చటానికి కనీసం ఒక్క పండునైనా ఆహారంగాఇవ్వలేక పోతున్నానని బాధపడింది. సహజసిద్దమైన దీనత్వం అతని కళ్ళల్లో ప్రకాశిస్తోంది. ఏమయ్యిందని చెట్టు అడగటమే ఆలస్యం.. అతడు మొదలెట్టాడు.

నేను ఏటికవతల ఊళ్ళో పని చేస్కుని, కాసిన్ని రాళ్ళు వెనకేసుకుని , నాకుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంతున్నాను. కానీ .. నడిదాటటానికి నావకి సరిపడా డబ్బులు నాదగ్గరలేవు.... .. అంటూ ఏకరువు పెట్టాడు.

నువ్వేం దిగులు పడకు బాబూ, నేనున్నానుగా .. నా ఈ కాండాన్ని నరికి నావ చేస్కో అంది.

ఆమాటలంటున్నప్పుడు అతడలా ఆచెట్టునే చూస్తూ ఉన్నాడు. కొడుకు ప్రయోజకుడు కాబోతున్నాడనే సంతోషం ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది. నిండుమనసుతో ఆచెట్టు అతన్ని దీవించింది.

ప్రయాణానికి అతడు నావ సిద్దం చేసుకున్నాడు. ఎదురుగా ఏరు దాట బోతున్న అతన్ని సంతోషం తో సాగనంపింది చెట్టు.
అతడు నావతో ఏరుదాటటం మొదలెట్టాడు. చెట్టు అలా చూస్తూనే ఉంది. కొద్ది కొద్దిగా అతడు తన గమ్యం వైపు సాగిపోతూ, ఇవతలి ఒడ్డుకీ, చెట్టుకీ దూరంగా వెళ్లిపోసాగాడు. చిన్నగా మసక మసగ్గా కనిపిస్తున్న ఆ నావని అలానే చూస్తూ ఉండి పోయింది చెట్టు .

భూమిని చీల్చుకొచ్చి గంభీరంగా,ఒంటరిగా, నిండుగా పెరిగి,
పూలూ పళ్ళతో , పెద్దపెద్దకొమ్మలతో ఎంతో అందంగా విస్తరించుకుని , ఎందరికో నీడను పంచి, తన కొడుక్కి ప్రేమను పంచిన చెట్టు మోడుబారి, రెండడుగుల తునకగా మిగిలిపోయింది.

ప్రతీ రోజూ ఆయేటినే చూస్తూ, కొడుకు తిరిగి వస్తాడన్న నిరీక్షణలో కాలం గడుపసాగింది చెట్టు.
దారిన పోయే , ప్రతీ ఒక్కరినీ , కొడుకు క్షేమ సమాచారం ఏమన్నా తెలిసిందేమోనని ఆరాతీయటం మొదలెట్టింది.

కొన్ని సంవత్సరాలు గడిచాయి,
ఒకరోజు సాయంకాలం ..
మైదానంలో పిల్లలు ఆటలాడుకుంటున్నారు.  ఓ పిల్లాడు  అలసిపోయి ఆచెట్టు తునకమీద కూర్చుని విశ్రాంతితీసుకోసాగాడు. అతన్ని తన మనవడిగా భావించటం మొదలెట్టింది చెట్టు..
  
__________________________________________________________________________________

ఇది ఒరియా కథ ..  గల్హాపువా  ( తల్లిచాటు కొడుకు అనే అర్ధమట )

మొన్న సరదాగా, మిరపకాయ బజ్జీలు తింటూ చెప్పుకున్న పిచ్చాపాటి కబుర్లలో నా కొలీగ్ సుధాంశు చెప్పిన కథ ఇది.
నాకు అర్ధమైన కథకి..  తెలుగు అక్షర రూపం.
రచయిత పేరు తెలీదన్నాడు.  కాపీరైట్ సమస్యలేమీ ఉండవనే అనుకుంటున్నాను .  అలాంటివి ఏమైనా ఉంటే తెలియచేస్తే
ఇక్కడనుంచి తొలగించగలవాడను ..




THANK  YOU.. 











ముద్దమబ్బుల పందిరికింద,
మెరుపుల వెలుగుల చూపులతో,
తొలకరి జల్లుల మాసంలో,
వానకు తడిసిన పుడమిన తాను,

నిశ్చలమైన ఆకృతిగా, పచ్చని చిగురుతో ప్రకృతిగా,
మెత్తని ఆకుల నవ్వులతో, పుత్తడి పోలిన పువ్వులతో,
పుడమిన పుట్టిన పాపై తానూ , పెరిగెను పెద్దగ ప్రేమను పంచగ 
సంజ వెలుగుల సూపులు సోకగ, మొగ్గలవోలె దాచెను  సిగ్గుని .

ఆడుకునేందుకు బొమ్మగ మారి
వేడుకునేందుకు అమ్మగ మారి
ఆకులు,పువ్వులు,కాయలతోటి,
ధరణిని నింపెను రంగులతోటి, 

ఆటన అలసిన పిల్లలను ,నిద్రను పుచ్చే పాటగ  తాను
పంచన చేరిన పాపలకు , నీడను పంచిన నేస్తం తాను
గూటికి చేరిన గువ్వలను, గుండెను పొదిగెను గోముగ తాను
మంచిగ జోడ్చిన చేతులకు,చల్లని గాలుల దీవెన తాను  

                             
కొమ్మలతోటి ఊయలలూపి,  ,
బంగరు భవితకు బాటలు చూపి,
కట్టమునోర్చి, కట్టెగామారి,  
తనప్రాణమునిచ్చి  ప్రేమను పంచె