Monday, October 18, 2010

అతడు - ఆమె ..














తొలిపొద్దు కోసం వేవేల కళ్ళతో ఎదురు చూసిన ఆమె కు కల నిజమవుతోంది.తూరుపున అరుణ కిరణాలు  చాలా సున్నితం గా ధరణి సోకుల్ని ముద్దాడుతున్నాయి . ప్రియుని స్పర్శ తో పులకరించిన పుడమి మంచు చీరని కొద్ది కొద్దిగా జారవిడుస్తూ ,తన సోకుల్ని కొంటెగా చూస్తున్న భానున్ని రమ్మంటూ సైగ చేసింది.
భానుడి బుగ్గలు సిగ్గుల మొగ్గలవుతున్నాయి. ధరిత్రి అణువణువూ పులకరిస్తోంది. రాత్రి తాలూకు విరహాన్ని ఒకే ముద్దు తో చెరిపేస్తున్నాడు అతడు.గత కాలపు విరహపు చీకట్లు మచ్చుకైనా కనిపించటంలేదు. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
గత రాత్ర్హి అతగాడు అటుగా వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన విషయాల్ని అతని కౌగిలి నుంచి వీడకుండానే నెమ్మదిగా అతని చెవిలో ఆమె చేరవేసింది .అతనూ అంతే అటుగా వెళ్లి, ఆమె ను గుర్తు చేసుకున్న క్షణాల్ని గంటల్లో చెప్తూ , అటుగా వచ్చిన మబ్బులచాటున దోబూచులాడుతూ, ఆమె లో కలిగే కలవరింతను ఓరకంట కనిపెడుతున్నాడు .అప్పటివరకూ నవ్వుతూ వున్న నెచ్చెలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది, నగుమోము చిన్నబోతూ వుంది.
కనులిప్తపాటులో కనపడకుండా పోయిన ప్రియున్ని చూడటానికి ఆమె మరీ కలవరించి పోతుంది.కనురెప్పల మాటున కమ్మని స్వప్నం కలలా కరిగిపోతున్నదుకు  కనుగంగ కడలయ్యేందుకు సిద్దమవుతోంది.ఆ విరహం అతన్నీ బాధించిందో ,జవరాలి కంట కన్నీరు అతని గుండెనుబికిందో,లేక ఇక చాలులే సరసం అనుకున్నాడో ఏమో వెంటనే వచ్చి ఆమె చెయ్యినందుకున్నాడతడు.
ఆమె అతన్ని చూడగానే ఒక్కసారిగా  వచ్చి  గట్టిగా హత్తుకుని , తన కౌగిలి లో ఐక్యం అయిపోతుంది అనుకున్నాడతడు. కానీ అలా జరగలేదు . ఆమె ఇంకా అల్లంత దూరాన్నే వుంది . చిత్రం.., ఆమె ముఖం కోమలత్వాన్ని వీడి కోపంతో ఎరుపెక్కిపోయింది.

"అదికాదురా జననీ , నా బుజ్జివి కదూ , నా చిట్టివి కదూ, ఏదో తమాషాకి, సరదాగా కాసేపు ఆటపట్టిద్దామని , అలా మరీ చిన్నపిల్ల లా , ప్రతీ చిన్న విషయానికి అలగకురా బంగారం.." అంటూ ఏదో చెప్పబోతున్నాడతడు. నీ సంజాయిషీ నాకేం అక్కర్లేదు అన్నట్టు గా సూటిగా అతనికల్లలోకి చూసిందామె. అంతే సూడ సక్కని సూరీడు సిన్నబోయాడు. బింకం గా చూసే అతగాడు బిక్కమొహమేసాడు. ఏంటో అనుకున్నాడు గానీ  ఆడాళ్ళ కళ్ళలోకి సూటిగా సూడటం కష్టమే .అతగాడికీ ఇప్పుడే అర్ధమయ్యింది పాపం.
 ఇరువురి మద్యా మౌనాన్ని చేదిస్తూ ఆమె మాట్లాడుతోంది, అతను గమనిస్తున్నాడు. ఆమె గొంతు కోపం గా లేదు , అలా అని లాలన గానూ లేదు , చాలా ఆర్ద్రం గా ఉంది."సరదాకైనా మన మద్య ఎడబాటు కలిగించే పనులు ఏమీ  చెయ్యవు కదూ " అంటూ వేడుకోలు గా అడుగుతోంది. చిన్నగా ఓ చిరునవ్వాడు అతడు.చెలిగాడికి తన భావం అర్ధమయ్యిందన్నసంతోషమో , లేక అతగాడు ఇప్పటికీ కవ్విస్తూ నవ్వుతున్నాడనే ఉడుకుబోతుతనమో తెలీదు కానీ,
 ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అతని గుండె ఆమె భావానికి  భాష్యం చెప్పలేనంటోంది . ఆమె కంట పొంగిన గంగ , ఇతని గుండె పొరలకి గండి కొట్టి మనసు సంద్రాన్ని చేరుతోంది.ఇతని కంట చెలమలో కూడా కమ్మని మదురామృతం ఉబికి వస్తోంది. ఒక్క ఆలింగనం తనువుల దూరాన్ని తగ్గించి మనసుల బంధాన్ని మరింత పెంచేది నిజమే అయితే అతడు అదే చేస్తున్నాడు . ఆప్యాయం గా దరిచేరిన కోమలి కన్నీటిని తుడుస్తూ , ఆమె తో అతడు పలికిన ఒకే మాట .. "నువ్వలా ఏడుస్తాననంటే నేను వెళ్లి పోతాను .నేనుండగ నీకంట నీరు నే చూడబోను , చూసినా తట్టుకోలేను ., ఏం చెయ్యమంటావ్ ? వెల్లి  పోనా..?".
 వెళ్లి పోతాను ..అనే మాట అతని నోట వినటమే ఇష్టం  లేనట్టు , అతని మాటలు ఇంకా పూర్తి కాకుండానే ఆమె చేతిని అతని నోటికి అడ్డుగా నిలిపింది.అతనుండగా ఎప్పుడూ ఏడవకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది . అతగాని వెచ్చని కౌగిలి లో ఆమె ఒదిగిపోయింది. అమ్మలా లాలిస్తున్న అతని ఒడిలో ఆమె పసిపాపలా నిదుర పోతుంది.ఈ క్షణం అతడి కోరిక "ఆమెనెప్పుడూ  ఇంతే భద్రం గా , సంతోషం గా , తన కంటి రెప్పలా కాపాడాలి, తన గుండెచప్పుడు అతని  గుండె తో వినాలి ." మరి ఆమె కోరిక ?
" ఎప్పటికీ కాలం ఇలానే నిలిచిపోవాలి , అతని సాంగత్యం లో ,వసి వాడని వసంతం తన వాకిట్లో ఎప్పుడూ వెళ్లి విరియాలి ."  .

 "నీకేం కావాలో కోరుకో ఒక్క మా ప్రేమ తప్ప___" అంటూ  వాళ్ళిద్దరూ ఇప్పుడు దేవుడికైనా వరమిస్తారు  (1)

No comments:

Post a Comment