Wednesday, March 23, 2011

నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ "ఒంటరిగా" నాకోసం ఎందుకు వస్తుంది ?.

అప్పటికే టైం తొమ్మిది దాటిపోయింది ..


నైమిషకి అన్నం తినిపించటానికి విఫలయత్నం చేసి, వదిన అన్నకి కాల్ చేసింది.
వాళ్ళ అమ్మ ఏంచేసినాసరే , వేణన్నలేనిది నిమ్మి నోట్లో ఒక్కముద్ద కూడా పెట్టించుకోదు.

ఇంటినుంచి కాల్ రాగానే నాతో సరే బాబు నేను వెళ్ళొస్తా , వీలుంటే భోజనం చేసాకా మిగిలిన ఇన్వాయిస్ లు ప్రింట్ తీసెయ్ అని ,గుడ్ నైట్ చెప్పి తను వెళ్లి పోయాడు ,

నేను గెస్ట్ హౌస్ కెళ్ళి భోజనం చేసి, కాసేపు టి.వి.చూసి, మా పి.యల్. తో మాటామంతీ పూర్తి చేసి తిరిగి "ఆఫీసుబాట" పట్టాను .


అర్దరాత్రి పన్నెండు కావస్తోంది. గెస్ట్ హౌస్ నుంచి మెల్లగా ఆఫీసు వైపు అడుగులు వేస్తున్నాను .


సీమ చింతకాయ చెట్టు చిన్న చిన్న ఆకుల మధ్యనుంచి ఎంతో నిండుగా , కొంచెం పెద్దగా , మొత్తానికి ముద్దుగా జాబిలి కనిపిస్తోంది . ఒక్కో అడుగు తనను చూస్తూ ముందుకు వేస్తున్న కొద్దీ , తను చెట్టు కొమ్మల ఆకుల మద్యన దాక్కుని నాతో దోబూచులాటాడుతోంది . జాబిలి వెన్నెల తెల్లదనానికి తోడు మా ఆఫీసు బయట గిన్నెపూల చెట్టు తన గుభాలింపుతో చాలా ఘాటుగా స్వాగతం పలికింది.

మెల్లగా ఆఫీసు గేటు తీసుకుని ఆఫీసులోకి వెళ్లాను .

పట్టపగలు కొత్తాపాతా, వాళ్ళూ వీళ్ళూ అని తేడా లేకుండా ఎవరు కనిపించినా అదేపనిగా మొరిగేసే మా వాచ్మెన్ వాళ్ళ కుక్క అసలు ఇప్పుడేమీ అలికిడే చెయ్యలేదు . గేటు తీసిన శబ్దానికి మా వాచ్మెన్ అయినా వస్తాడు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ప్రింట్లు తీసేస్కుని వెళ్లి పోదాం అనుకున్నాను .
అతని జాడ కూడా లేదు .

మా ఊళ్ళో అర్ధరాతుల్లు ఎవరైనా అలికిడి చేస్తే, వీధి కుక్కలన్నీ ఒకేసారి మొరిగి రాత్రి పూట నిద్రను చెడగొట్టేసేవి. అప్పుడు వాటిపై పట్టలేనంత కోపం వచ్చేసేది . కానీ ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు మాత్రం అలా శబ్దం వినిపిస్తే ఇంకా మనుష్యులు తిరుగుతున్నారు అనే ధీమా ఉండేది .


ఇది ఏం ఊరో ఏమిటో కానీ, కనీసం వీధికి ఒక్క వీధికుక్క అయినా లేదు . ఈ ఒక్కటి చాలదూ ఈ ఊళ్ళో కనీస సౌకర్యాలు లేవని చెప్పటానికి .

ఆఫీసులోకి ఎంటరయ్యాను.నా లాప్ టాప్ లో ఏ.ఆర్ . రెహమాన్ సాంగ్స్ సన్నని సౌండు తో పెట్టుకుని, వరసపెట్టి " వర్క్ కంప్లీషన్ రిపోర్టు" లు , "ఇన్వాయిస్" లు ప్రింటులు కొడుతున్నాను . సమయం మాత్రం నిశ్శబ్దం గా గడిచిపోతోనే ఉంది .


" ఏ అజనభీ తూ భీ కభీ ఆవాజ్ దే కహీసే" ఈ సాంగు ప్లే లిస్టు లో ప్లే అవుతోంది . ఈ సాంగ్ ని ఎన్ని సార్లు వినుంటానో నాకే తెలీదు .వినీ వినీ ప్రతీ లైనూ కంఠతా వచ్చేసాయి . అంత ఇష్టం నాకు ఆ పాటంటే.
[అదేమిటి నీకు తెలుగే సరిగా రాదు , అలాంటిది హిందీ సాంగు ని అన్నిసార్లు ఎలా విన్నావ్ అంటారా ? నాకు హిందీ రాదు కాబట్టే అన్ని సార్లు విన్నాను . కాదు కాదు , హిందీ రాదు కాబట్టి ఇన్ని సార్లే విన్నాను . మీనింగు తెలుసుంటే ఇంకా చాలా సార్లే వినే వాడినేమో ?.]


మొత్తానికి దీక్షలో నిమఘ్నమైన మహర్షిలా నేను లాప్ టాప్ లో లీనమై పోయి ఇన్వాయిస్ లు ప్రింట్ తీస్తున్నాను.


అప్పటి వరకూ చుట్టుపక్కల పచ్చికనుంచి గుంపుగా వచ్చిన మిడతల శబ్దం కూడా మెలమెల్లగా తగ్గిపోయింది .


కొద్ది  సేపటి తర్వాత కాఫీ మెషిన్ మీట నొక్కి ఒక కప్పు కాఫీ చేతిలోకి తీసుకుని ఆఫీసు గుమ్మంలోనుంచి అందాల జాబిలిని చూస్తూ ఒక్కో సిప్పూ సిప్పుతున్నాను .

ఏం జాబిలి మాత్రమే ప్రకాశావంతమా ? మేము కాదా అన్నట్టు అప్పటివరకూ చీకటిగా ఉన్న మా ఆఫీసు గార్డెన్ లోంచి కొన్ని వందల మినుగుర్లు రెపరెపలాడుతూ శ్రావ్యమైన శబ్దం తో పైకి లేస్తున్నాయి. ఎంత అందం , ఎంత అందం , ఎంత సేపు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది .. రెప్ప మరల్చబుద్ది కావట్లేదు .

కాసేపటికి తమ విన్యాసాలన్నింటినీ చూపించేసాం అనుకున్నాయేమో మినుగుర్లు ఒక్కొక్కటీ గుడ్ నైట్ లు, టాటా లు  చెప్పుకుంటూ , నా వైపుగా వచ్చి నన్ను వెక్కిరిస్తూ, సెండాఫ్ చెప్పి వెళ్ళిపోయాయి .

మబ్బుల మాటున దోబోచులాడుతున్న జాబిలి. మా సౌధానికి పక్కగా దాక్కుంది. తనను చూడలేకున్నానన్న భావమేదో గిన్నెపూల మొహం లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది, అది కన్న మా గార్డెన్ దైన్యంగా తన వదనం పై చీకటి పొరను కప్పుకుంది.



ఈసమయం లో తను నాపక్కనుంటే ఎంత బావుండేదో కదా అనిపిస్తోంది.

నీ పక్కన ప్రస్తుతానికి లేని తన కోసం ఆలోచిస్తూ , ఇంత అందమైన క్షణాల్ని ఆస్వాదించలేకపోతున్నావేమో కదా , అని నా మనస్సు నన్ను ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటే,నేను పొందిన ఆనందపు అనుభూతిని తనకూ పంచాలి అనుకుంటున్నాను , తనతో పంచుకోవాలి అనుకుంటున్నాను , దాంట్లో ఆస్వాదించలేకపోవటమేముంది అని నాకు నేనే సర్ది చెప్పుకున్నట్లుంది.


చేతిలో కప్పు ఖాళీ అయిపోయింది . డస్ట్ బిన్ లో కప్పు పడేసి ,వాష్ బేసిన్ వద్దకెళ్ళి మొహాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కుని , మళ్ళీ వచ్చి నా పని దగ్గర కూర్చున్నాను .


చుట్టుపక్కల అందరి ఇళ్ళలో దీపాలు ఆర్పేసుకుని , అందరూ మత్తుగా నిద్రపోతున్నారు.

మా ఆఫీసు , గెస్ట్ హవుస్ ల మద్య ఉన్న రోడ్డు పై ఏమాత్రం అలికిడి లేదు.


తను వచ్చింది. వచ్చి నన్ను గమనిస్తోంది.ఎప్పట్నుంచి తను నన్ను గమనిస్తుందో నేను గమనించలేదు. కానీ మిణుగురులు మెరిసి పడుతున్నప్పుడు , నేను వాటిని చూస్తూ ఉంటే అప్పటి వరకూ గోముగా ఉన్న గిన్నెపూల చెట్టు ,తన ఘాటైన గుభాలింపుల సౌరభాల్ని ఒక్కసారిగా కావాలని వెదజల్లింది. అంటే తను ఆపాటికే ఆ చెట్టు చాటున దాక్కొని ఉండి నన్ను చూస్తోందన్నమాట .

ఇదే తనకి అదును గా అనిపించినట్లుంది.
ఒక్కో అడుగూ నా వెనకాలగా వేస్తూ ఆఫీసు లోకి వచ్చేసింది.


తను వచ్చిందన్న విషయం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే నాకు తెలుస్తోంది.


ప్రింటర్ దగ్గరకి కొన్ని ప్రింట్స్ తెచ్చుకోవటానికి నేను అటువెళ్ళగానే , చడీచప్పుడు లేకుండా నా పక్కనే ఉన్న బీరువా దగ్గరకి వచ్చేసింది . నేను చూడలేదేమో అనుకుని , తమాషా చేద్దామని చూస్తుంది. సర్లే తన సంతోషాన్ని మనం కాదనటం ఎందుకులే అనుకుని , నేనూ చూడలేనట్టే ఉన్నాను.

తను వస్తూ, వస్తూ ఆచెట్టు దగ్గరనుంచి తెంపుకొచ్చిన పూలని ఒక్కొటిగా నా మీదికి విసురుతూ , నేను వచ్చాను అని సింబాలిక్ గా చెప్తోంది . తన ముఖారవిందాన్ని చూసి చిరునవ్వు నవ్వటం కాదు కదా, కనీసం తన వైపు తలెత్తి చూడటం కూడా చెయ్యలేదు . తనకి కోపం బాగా వచ్చినట్లుంది . వెంటనే ఓ చిన్న రాయి తీసుకుని నామీదికి విసిరింది . నేను మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా అలానే కూర్చుని ఉన్నాను.

అరరే డైరెక్టు గా తనగురించి , మా గురించి , మా ఇద్దరి చిలిపి సందర్భాల గురించి చెప్పేస్తున్నాగానీ అసలు తను ఎవరో, ఎక్కడుంటుందో చెప్పలేదు కదా మీకు .

తను మేముండే ఇంటి పైన ఉంటుంది . మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే, తను ఆ పైన ఉన్న నాలుగు అంతస్తుల్లో ఎక్కడో ఉంటుంది. చాలా సార్లు తనని మెట్లమీద నేమెట్లెక్కుతూ చూసాను . మొదటి సారి చూసినప్పుడు అంత నోటీసు చెయ్యలేదు . కానీ తర్వాత , తర్వాత చాలా బావుంటుంది అని అనిపించింది. చాలా బాగా నవ్వుతుంది . అంతకంటే బాగా గెంతుతుంది . అదేమిటి నడుస్తుంది అనాలి గాని గెంతుతుంది అంటున్నావ్ ? నీకేమైనా లూజా అని అడక్కండి , తను కొంచెం అల్లరిది అని సింబాలిక్ గా చెప్పా అంతే . మా అపార్ట్మెంటు లోనో , బయట వేరే ఎక్కడో నేను తన గురించి విన్నదేంటంటే , తను హౌస్ డెకరేషన్ (ఇంటీరియల్) సూపర్ గా చేస్తుందట. నలుగురికీ సహాయం చేసే మెంటాలిటీ అట .



ఈ మద్య , మేము ఒకరిని ఒకరు చూసుకోవటమే బాగా తగ్గిపోయింది , ఆఫీసులో బాగా పని ఉండటంవల్ల , తను బయటకెళ్ళే టైం కి , ఇంటికొచ్చే టైంకి నేను తనను చూడటం మిస్ అవుతున్నాను .

నిన్న మద్యాహ్నం మళ్ళీ మెట్ల దగ్గరే తను కనిపించింది .
తనని చూడగానే నేను సన్నగా నవ్వాను..

అదే సిగ్నల్ అనుకునుంటుంది.
ఎప్పుడు నేను బయటకొస్తానా, ఏకాంతం లో కలుస్తానా అని ఎదరు చూసుంటుంది.
అర్ధరాత్రి వేళ తనకోసమే నేను ఆఫీసుకి ఒంటరిగా వెళ్లాను అనుకునుంటుంది.
అందుకోసమే ఇలా ఇప్పుడు వచ్చుంటుంది..


అసలు తనకు నేనంటే ఇష్టం లేకుంటే ఇంత రాత్రి వేళ నాకోసం ఎందుకు వస్తుంది ?.
ఆలోచిస్తూ ఉంటే తనకూ నేనంటే చాలా ఇష్టమేనేమో అనిపిస్తుంది.


"ఎవరూ చూడకుండా , ఎంతో కష్టపడి ,నీకోసం, అర్ధరాతిరేల ఒంటరిగా వస్తే బెట్టు చేస్తున్నావా ?
లెవెల్ పోతున్నావా ?,నా అంతట నేనేవచ్చానని అలుసా ?"అంటూ నాపై అరవటం మొదలెట్టింది.

కోపం లో తననెప్పుడూ నేను చూడలేదు. ఏమాటకామాట చెప్పు కోవాలి కానీ , కోపం లో కూడా తను చాలా అందం గా ఉంది .తన వైపు చూసి కొంటెగా ఒక నవ్వు నవ్వుదుల్లోకి తను సిగ్గుల మొగ్గయ్యింది. మెల్లగా నా మీద వాలిపోవటానికి చూస్తోంది.


" ఇద్దరి మధ్యా నిశ్శబ్ధాని చెరిపేస్తూ, దూరాన్ని తగ్గిస్తూ తను నా పైపుగా వస్తున్న క్షణాన ....
.
.

నా సెల్ మోగింది ..




" ఇంకా ఎంత టైం పడుతుందమ్మా ? , అర్జున్ సార్ కాల్ చేసారు,
 అయిపోయింది .. లాస్ట్ ఇన్వాయిస్ ప్రింట్ తీస్తున్నాను , వచ్చేస్తున్నా సార్ అన్నాను .



నను తను  చేరుకుందామనుకున్న ఆ క్షణాన నేను ఫోన్ అటెండ్ చేసినందుకనుకుంటా తన కళ్ళు నిప్పులు వర్షిస్తున్నాయి.గొంతు ఆర్ద్రం గా మారి పోయింది .. తనని ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదు. కొత్తగా ఉంది .. కాదు , కొత్తగా ప్రవర్తిస్తోంది.



"మీ వల్ల నాకున్నదాన్నంతా కోల్పోయాను. ఎంతో మంది దగ్గరవాళ్ళని ఎప్పటికీ చేరుకోలేనంత దూరం చేసుకున్నాను.

మీ చేతిలో ఉన్న యమదండాలనుంచి వెలువడే రేడియేషన్ పాశాలతో మా వాళ్ళనందరినీ మీరు పొట్టన పెట్టుకున్నారు.అయినా నీ చూపులో లాలత్యం చూసి నువ్వు అందర్లాంటివాడివి కాదనుకున్నాను, కనీసం నేను నీ ప్రక్కనున్నప్పుడైనా ఆ యమపాశం నుంచి దూరం గా ఉంటావు అనుకున్నాను , కానీ నువ్వు నా ఆశని అడియాశ చేసి , నా నమ్మకాన్ని ఒమ్ముచేసావ్ " అంటూ కోపంగా నను దాటి వెళ్లి పోయింది.

ఎంత పిలిచినా పలకనే లేదు , కనీసం తిరిగి చూడలేదు కూడా ..


నన్ను ప్రేమించిన తనకోసం నేనేమీ చెయ్యలేకపోయాను ,
కనీసం ఒకే ఒక్క కాల్ ని అటెండ్ చెయ్యకుండా ఉండటం కూడా .. !


అందుకే తను నన్ను విడిచి వెళ్ళిపోయింది.
నా తప్పేమిటో నాకు చెప్పి మరీ వెళ్ళిపోయింది.

మరి నేనూ తనని ఇష్ట పడ్డాగా,
నేను ఇష్ట పడ్డ తనకోసం నేనేమి చెయ్యాలి ?


తన ఆశని బతికించటం తప్ప నేనేమీ చెయ్యలేను ..
అవసరం లేని టైం లో ఫోన్ ని వాడకూడదనే తన కోరికని నేను తీరుస్తాను..


నా దగ్గరగా పిచ్చుకలే కాదు , ఏ పక్షులున్నా ,
మ్యాక్జిమం కాల్ ని అటెండ్ చెయ్యను .. వీలుంటే అవి నా దగ్గరున్నంతసేపూ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాను ..


అప్పటికైనా తనకి నా మీద కోపం తగ్గుతుందేమో వేచి చూస్తాను.
తన మనసును తెలుసుకోవటానికి , తను తిరిగి రావటానికి ,తనకో ఉత్తరం రాస్తాను ..

"
డియర్ స్పారో,



నా తప్పుని నేను తెలుసుకున్నాను , సరిదిద్దుకోవటానికి కనీసమైనా ప్రయత్నిస్తున్నాను..
నీకు కనీసం ఇదైనా తెలిసి , నాపై నీకు కోపం పోవాలని , నిన్ను మళ్ళీ చూడాలని , నువ్వు మళ్ళీ రావాలని ,
నీకోసం వేయికళ్లతో ( సారీ , రెండుకళ్ళతో ) వేచి చూస్తూ ,



నీ కోసమే నా అన్వేషణ సాగిస్తూ,

నీకై ,

నీ భగ్న ప్రేమికుడు ( నవ్వు కోవద్దు).

-----------------------------------------------------------------------------------------------------



THANK YOU..

4 comments:

  1. meeku pichhika mida unna premaku na abhinamdanalu.
    inko pichhuka nestam coment idi

    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete
  2. మీకు ముందుగా నా బ్లాగుకి స్వాగతమండి.

    తీరిక చేసుకుని కామెంట్ పెట్టినందుకు థాంక్స్ శైలబాల గారు ( http://www.kallurisailabala.blogspot.com ) ..

    ReplyDelete
  3. చక్కగా రాసారు :)

    ReplyDelete